- `పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో హరీశ్ మెంటల్ బ్యాలెన్స్ తప్పారు
- రుణమాఫీ, సీతారామ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే హక్కు హరీశ్‌కు లేదు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు : ‘కబ్జాలు, కమీషన్ల గురించి బీఆర్ఎస్‌కు తెలిసినంత దేశంలో మరే పార్టీకి తెలియదు’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కబ్జాల గురించి నీతులు చెప్పే హరీశ్‌రావు.. ఎన్‌ఎస్‌పీ భూములు కబ్జా చేసిన స్థలంలోనే, ఆ కబ్జాకోరులతోనే కలిసి సమావేశం పెట్టి కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యం లేక, అవమానాలను తట్టుకోలేక హరీశ్‌రావు మానసికంగా బ్యాలెన్స్ తప్పారన్నారు.
ఖమ్మం క్యాంప్ ఆఫీస్‌లో సోమవారం తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రుణమాఫీ,సీతారామ ప్రాజెక్ట్‌పై మాట్లాడే నైతిక హక్కు హరీశ్‌కు లేదన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్ట్‌లో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ లేకుండా, కేవలం కమీషన్లు వచ్చే పనులు చేసి రూ.8 వేల కోట్లు మట్టిలో పోశారని, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు లేకుండా, కమీషన్ల కోసం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.100 కోట్లతో వైరా లింక్ కెనాల్ చేపట్టి లక్షన్నర ఎకరాలకు నీరందేలా చేశామన్నారు.
ఆయిల్‌పామ్ రైతులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మించామని చెప్పారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పాల్గొన్నారు.

